ఓ ఉపాధ్యాయుడి ఆలోచన
ఉపాధ్యాయుడిగా.. వెబ్ సేవల్లో..
ఆ ఉపాధ్యాయుడు ఖాళీ సమయాన్ని వినియోగించుకున్నారు. ఇంటర్నెట్ ప్రాధాన్యం తెలుసుకొని అందులో పరిజ్ఞానం పెంచుకున్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, ఉద్యోగులకు విలువైన సమాచారాన్ని అందించాలనుకున్నారు. అందుకోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి సేవలందిస్తున్నారు వేముల ప్రకాశ్.
వృత్తి ఉపాధ్యాయుడైనా వెబ్ సేవలను ప్రవృత్తిగా చేసుకొని రాణిస్తున్నారు. కొడకండ్ల మండలం అవుతాపురం గ్రామానికి చెందిన ప్రకాశ్ తొర్రూరు మండలం సోమారంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న నెటిజన్లు, యువత, విద్యార్థులు, ఉద్యోగుల అవసరాలను గుర్తించి వారికి ఆన్‌లైన్ సేవలు అందించడంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు.
‘టీచర్స్ బడి.ఇన్’ రూపకల్పన
2002 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారు. ఆయనకు లభించిన ఖాళీ సమయాలను వృథా చేయకుండా ఇంటర్నెట్ పరిజ్ఞానం పెంచుకొని ‘టీచర్స్ బడి.ఇన్’ అనే వెబ్‌సైట్‌ను 2013 జూన్‌లో రూపొందించారు.
వివిధ వర్గాల అవసరాలను గుర్తించి వారికి కావలసిన సమాచారాన్ని అందించే విధంగా వెబ్‌సైట్‌ను తయారు చేశారు. దీని ద్వారా అన్ని రకాల సమాచారం అందిస్తున్నారు. రోజుకు 10 వేల మందికి పైగా ఈ వెబ్‌సైట్‌ను వీక్షిస్తున్నారని వార్తా కథనం పేర్కొంటోంది.
నిరుద్యోగులు, విద్యార్థులకు..
ఈ వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నిరుద్యోగులు, విద్యార్థులకు అందిస్తున్నారు. ఇందులో ఉద్యోగ ప్రకటనలు, పోటీ పరీక్షల వివరాలు, పరీక్ష ఫలితాలు, హాల్ టికెట్లు, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎలాంటి కోర్సులు చేయవచ్చు, ఎవరిని సంప్రదించాలనే వివరాలు పొందుపరిచారు.
ఆన్‌లైన్‌లో ఏ విధంగా దరఖాస్తు అందించాలో యూజర్ గైడ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జీవోలు, ఉత్తర్వులు, ఉద్యోగ ప్రకటనలు వెంటవెంటనే పొందుపరుస్తున్నారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు…
ఉపాధ్యాయుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఉద్యోగుల డాటా ఎంట్రీ, ఇన్‌కంటాక్స్ బిల్లుల తయారీ, వేతనాల బిల్లుల తయారీని తెలుపుతూ వివరాలు అందిస్తున్నారు.
ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి వెలువడిన మార్గదర్శకాలు, ఉత్తర్వులు, ప్రభుత్వ జీవోలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.
వేతన పంపిణీ, విడుదలలకు సంబంధించిన సమాచారం, ఉద్యోగుల వేతన, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వివరాలు పొందుపరుస్తూ సేవలందిస్తున్నారు.
విద్యార్థులకు కంప్యూటర్ పాఠాలు
సోమారం ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడి సహకారంతో కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నారు.
ప్రాథమిక తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, రైమ్స్ బోధించడంతో పాటు సాంకేతిక అవగాహనను కల్పిస్తున్నారు.
భవిష్యత్తులో పాఠ్యాంశాలతో పాటు కంప్యూటర్‌పై మరింత పరిజ్ఞానం కల్పించాలని, ఉపాధ్యాయులు, సమాజ భాగస్వామ్యంతో వనరులు సమీకరించుకుని డిజీ పాఠశాలగా మార్చాలనేది యోచిస్తున్నట్లు ప్రకాశ్ పేర్కొంటున్నారు.
అందుబాటులో సేవలిలా...
వెబ్‌సైట్ రూపకల్పన చేసిన ప్రకాశ్ యూజర్స్ ఫ్రెండ్లీగా పలువురికి కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, వెబ్ డిజైన్ సహకారాన్ని అందిస్తున్నారు.
ఈ సైట్లలో తాజా సమాచారాన్ని సోషల్ నెట్‌వర్క్స్ ద్వారా కూడా పొందేలా రూపకల్పన చేశారు.
- కంప్యూటర్ హార్డ్‌వేర్ సహకారం
- సాఫ్ట్‌వేర్ సహకారం
- వెబ్ డిజైన్ సహకారం
- తాజా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందించడం
- విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపయోగకరమైన సమాచారం
వెబ్‌సైట్‌లోని అంశాలకు సందేహాలు, సలహాలు ఇవ్వాలనుకునే వారు కామెంట్ బాక్సును వినియోగించుకొని అనుభవాలు, అభిప్రాయాలు తెలిపితే వాటిని తీసుకొని సమాచారానికి జోడిస్తున్నారు.
ఎవరి వద్దనైనా సమాజానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ పాఠాలు ఉంటే వాటిని మెయిల్ చేస్తే వెంటనే వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, ఉపాధ్యాయులు కొత్తగా పాఠ్య, యూనిట్ ప్రణాళికలు, పరీక్షల నిర్వహణ నమూనాలు ఉంటే ‘టీచర్స్ బడి.ఇన్’కు పంపితే అందరికీ అందుబాటులో ఉంచుతానని ప్రకాశ్ పేర్కొంటున్నారు.