Skip to main content

Servant of the unemployed | నిరుద్యోగుల సేవకుడు

సాక్షి — వార్తా కథనం

నిరుద్యోగుల సేవకుడు

టీచర్స్ బడి • వేముల ప్రకాశ్
నిరుద్యోగుల సేవకుడు - సాక్షి వార్తా కథనం
సాక్షి వార్తా కథనం — “నిరుద్యోగుల సేవకుడు”
🌐 ఇంటర్నెట్ ద్వారా యువతకు సమాచారం
💻 టీచర్స్ బడి వెబ్‌సైట్
👥 రోజూ 18 నుంచి 20 వేల మంది వీక్షకులు
ఆయన వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూ సేవ చేస్తున్నాడు. ఓ ప్రమాదంలో కాలు విరిగి మంచాన పడినప్పుడు ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని పెంచుకొని నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా సమాచారం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు వెబ్‌సైట్ కూడా రూపొందించాడు. టీచర్స్ బడి పేర వెబ్‌సైట్ నిర్వహించడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

నిరుద్యోగుల సేవకుడు

జనగామ జిల్లా కొడకండ్ల మండలం అవుతాపురం గ్రామానికి చెందిన వేముల ప్రకాశ్ విద్యార్థి దశలో టీవీ మెకానిక్‌గా మెలకువలు నేర్చుకున్నాడు.

ఆ తర్వాత ఎంతో కష్టపడి 2002 డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. అప్పటినుంచి ఖాళీ సమయం దొరికితే ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని వినియోగించేవాడు. ఈ క్రమంలో పలువురికి విలువైన సమాచారం అందించడం అలవాటుగా మార్చుకున్నాడు.

తాజా సమాచారం, విషయాలు పొందుపరుస్తూ మూడేళ్లలోనే వెబ్‌సైట్‌ను రోజు 18 వేల నుంచి 20 వేల మంది వీక్షించేలా చేశాడు.

వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందిస్తూ, తొర్రూరు మండలం సోమారం పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తూ పలువురి అభినందనలు పొందుతున్నాడు.

వెబ్‌సైట్ ద్వారా సేవలు

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తుండగా 2012 డిసెంబర్ నెలలో ప్రమాదవశాత్తు ప్రకాశ్ కాలు విరిగింది. దీంతో నాలుగు నెలలపాటు ఇంటివద్దే విశ్రాంతి తీసుకున్నాడు.

ఈ సమయంలో తనకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని వినియోగించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా సొంతంగా వెబ్‌సైట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

2013 జూన్ నెలలో www.teachersbadi.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.

  • ఉపాధ్యాయులు, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగుల వివరాలు నమోదు చేయడం
  • సీపీఎస్ డాటా ఎంట్రీ
  • ఇన్‌కంటాక్స్ బిల్లుల తయారీ
  • వేతనాల బిల్లుల తయారీ
  • ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఉత్తర్వులు, ప్రభుత్వ జీవోలు
  • విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు
  • పోటీ పరీక్షల వివరాలు
  • పరీక్షల ఫలితాలు, హాల్‌టికెట్లు
  • ఉత్తీర్ణులైన విద్యార్థులు చేసే కోర్సుల వివరాలు

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఒకే వెబ్‌సైట్‌లో సమాచారాన్ని అందిస్తున్నాడు.

విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ

వేముల ప్రకాశ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తొర్రూరు మండలం సోమారం యూపీఎస్ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఐదు కంప్యూటర్లు వచ్చాయి.

ఆ కంప్యూటర్ల వినియోగంతో పాఠశాలలోని విద్యార్థులకు డిజిటల్ వాతావరణాన్ని కల్పిస్తున్నాడు.

తెలుగు, ఇంగ్లీష్ రైమ్స్ ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఒకటో తరగతి నుంచి మూడోతరగతి విద్యార్థులకు చూపించడం, ప్రస్తుత పరీక్షా విధానాన్ని విద్యార్థులకు అందించడం, వీడియో పాఠాలు చూపిస్తూ సబ్జెక్టుపై పరిజ్ఞానాన్ని పెంచుతున్నాడు.

“
ఇతరులకు సేవ చేస్తేనే నా మనస్సుకు సంతృప్తిగా ఉంటుంది. ప్రతి రోజూ ఏదో ఒక సేవ కార్యక్రమం చేయాలే తపన ఉంటుంది.
— వేముల ప్రకాశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

సేవే సంతృప్తి

ఇతరులకు సేవచేస్తేనే మనస్సుకు సంతృప్తిగా ఉంటుందని వేముల ప్రకాశ్ పేర్కొన్నారు. డ్యూటీలో భాగంగా పాఠ్యాంశాలు బోధిస్తూ ప్రాథమిక దశలోనే విద్యార్థులందరికీ కంప్యూటర్‌పై పరిజ్ఞానాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు.

ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్ ముందే కూర్చుంటూ, తోటి ఉద్యోగులతోపాటు నిరుద్యోగులందరికీ మంచి సమాచారాన్ని అందిస్తున్నారు.

మూలం: సాక్షి | Tue, 20 December 2016